metro rail: రూ. 60 మెట్రో టిక్కెట్ రూ. 54కే... స్మార్ట్‌కార్డ్ ఉన్నవారికి మాత్రమే!
- 10 శాతం రాయితీ ప్రకటించిన ఎల్ అండ్ టీ
- ఇవాళ్టి నుంచి అమలు
- వచ్చే ఏడాది మార్చి 31 వరకూ వర్తింపు
స్మార్ట్ కార్డు ఉన్నవారికి టిక్కెట్ ధరపై 10 శాతం రాయితీని ఎల్ అండ్ టీ ప్రకటించింది. దీంతో మెట్రో టిక్కెట్ గరిష్ట ధర రూ. 60కి బదులుగా స్మార్ట్‌కార్డ్ ఉన్న వారు రూ. 54 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ రాయితీ అందుబాటులో వుంటుంది. ఇప్పటివరకు కార్డు మీద 5 శాతం మాత్రమే రాయితీ లభించేది. దాన్ని మరో 5 శాతానికి పెంచి ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ముందుగా రూ. 200 చెల్లించి స్మార్ట్‌కార్డు తీసుకోవాలి. గరిష్ఠంగా రూ.3 వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. మెట్రో అధికారిక వెబ్సైట్, టీ-సవారీ యాప్, స్టేషన్లలోని యాడ్-వాల్యూ యంత్రాల ద్వారా కార్డులను రీఛార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా తొలిసారి రూ.100, ఆపైన రీఛార్జ్ చేసుకుంటే రూ.20 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇప్పటివరకు 1.70 లక్షల స్మార్ట్‌కార్డులు అమ్ముడైనట్లు ఎల్ అండ్ టీ తెలిపింది.