intercaste marriage: కులాంతర వివాహాలకు కేంద్రం ప్రోత్సాహం... పథకంలో చిన్న మార్పు
- వార్షికాదాయ పరిమితి నిబంధనను తొలగించిన కేంద్రం
- పథకానికి పెద్దగా స్పందన రాకపోవడమే కారణం
- రెండు విడతలుగా ప్రోత్సాహం
కులాంతర వివాహాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రోత్సాహ పథకంలో కేంద్ర ప్రభుత్వం చిన్న మార్పు చేసింది. ఇప్పటివరకు ప్రోత్సాహం అందుకోవాలంటే దంపతుల వార్షికాదాయం రూ. 5 లక్షలకు మించి ఉండరాదనే నిబంధన ఉండేది. అయితే తాజాగా ఈ నిబంధనను తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.
ఈ పథకం గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం, వార్షికాదాయ నిబంధన కారణంగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. 2013 - 2016 మధ్య కేవలం 116 జంటలకు మాత్రమే ప్రోత్సాహకం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువ మందిని ఆకర్షించడం కోసమే ఈ నిబంధనను తొలగించి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పథకం ప్రకారం దళితులను వివాహం చేసుకొనే వారికి రూ.2.5 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తారు. వధువు గానీ, వరుడు గానీ ఎవరో ఒకరు దళిత వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ ప్రోత్సాహకాన్ని రెండు విడతలుగా వారికి అందజేయనున్నారు. దంపతుల దరఖాస్తును అంబేడ్కర్ ఫౌండేషన్ క్లియర్ చేసిన తర్వాత రూ.1.5 లక్షలు, మిగతా రూ. లక్షను వారి పేరున బ్యాంకు ఉమ్మడి ఖాతాలో జమచేస్తారు. ఆ డబ్బును మూడేళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు.