Guntur: అందమైన అమ్మాయిలు దిగుతారు... యువ డాక్టర్లకే వలేస్తారు!: ఏపీలో నయా మోసగత్తెలు
- గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముఠా
- ఇప్పటివరకూ 11 మంది డాక్టర్లకు వల
- రూ. 70 లక్షలు వసూలు చేశారని అనుమానం
- ఎవరికీ చెప్పుకోలేకపోతున్న కుర్ర డాక్టర్లు
నవ్యాంధ్రలో, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లోని యువ డాక్టర్లే లక్ష్యంగా నయా మోసగత్తెలు రంగంలోకి దిగారు. వారికి మాయమాటలు చెప్పి లక్షల్లో దండుకుని ఉడాయిస్తుండగా, యువ డాక్టర్లు పరువు పోతుందన్న ఆందోళనలో విషయం ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పటివరకూ 11 మంది డాక్టర్లు వీరి ఉచ్చులో పడి మోసపోయారు.
అసలు ఏం జరుగుతోందంటే... అమరావతి ప్రాంతంలో దిగిన ఓ ముఠా పక్కా ప్లాన్ తో వైద్యులను ట్రాప్ చేసి డబ్బులను గుంజుతోంది. ముందుగానే డాక్టర్లను ఎంపిక చేసుకుని మరీ వస్తున్న ఈ అందమైన అమ్మాయిలు, వైద్యం పేరుతో డాక్టర్లకు వలేస్తున్నారు. డాక్టర్లకు తమ వ్యక్తిగత విషయాలను చెబుతున్నట్టు నటిస్తూ దగ్గరవుతున్నారు. తన భర్త సంసారానికి పనికిరాడంటూ కబుర్లు చెప్పి, తమ అందచందాలతో లోబరచుకుంటున్నారు.
ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని నమ్మబలుకుతారు. ఇంటికి ఒక్కసారి రావాలని అడిగి, వారిని ఇంటికి రప్పిస్తున్నారు. వారితో రాసలీలలు ఆడుతారు. ఈ రాసలీలలను చక్కగా రహస్య కెమెరాలతో రికార్డు చేసిన అనంతరం వీరిలోని మరో కోణం బయటకు వస్తుంది. వాటిని చూపి డాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి, వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.
కుర్ర డాక్టర్లు, ముఖ్యంగా 30 నుంచి 40 మధ్య వయసున్న డబ్బున్న డాక్టర్లు ఉన్న ఆసుపత్రులను ఎంచుకునే ఈ ముఠా వెనుక ఓ పెద్ద గ్యాంగ్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల గుంటూరుకు చెందిన ఓ యువ డయాబెటాలజిస్ట్ నుంచి ఈ ముఠా భారీగా డబ్బు వసూలు చేయడం, ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీగ లాగే పని ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈ దందా జోరుగా సాగుతోందని సమాచారం.
మోసపోయిన వైద్యులు ఒకరి వద్ద ఒకరు తామెలా మోసపోయామన్న విషయం చెప్పి బావురు మంటున్నారు. గుంటూరులో నలుగురు, విజయవాడలో ఐదుగురు, ఒంగోలులో ఇద్దరు వైద్యులు వీరి వలలో చిక్కుకుని దాదాపు రూ. 70 లక్షలు సమర్పించుకున్నట్టు గుర్తించిన పోలీసులు, వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న డాక్టర్లు, విషయం బయటకు తెలిస్తే, తమ పరువు పోవడంతో పాటు ప్రాక్టీస్ దెబ్బతింటుందన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.