bus yathra: విభజన తర్వాత రాష్ట్రం చాలా నష్టపోయింది.. కనీసం ఇదైనా పూర్తి చేయండి: పోలవరం వద్ద వైసీపీ నేతలు
- విశాఖపట్నం రైల్వేజోనుని కూడా సాధించలేకపోయారు
- రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో అర్థం ఏంటీ
- పోలవరం పనులు మెల్లిగా కొనసాగుతున్నాయి
- కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
పోలవరం ప్రాజెక్టు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. ఈ రోజు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు పలువురు వైసీపీ నేతలు 'పోలవరం ప్రాజెక్టు బస్సు యాత్ర' చేపట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ... పోలవరంపై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. విభజన తరువాత రాష్ట్రం ముందే చాలా నష్టపోయిందని, కనీసం ఈ ప్రాజెక్టునయినా పూర్తి చేయాలని అన్నారు.
ప్రభుత్వ నేతలు విశాఖపట్నం రైల్వే జోనుని కూడా సాధించలేకపోయారని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. పోలవరం పనులు మెల్లిగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఏపీ ప్రజలు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు గురించి శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చారని వైసీపీ నేతలు చెప్పారు. అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం 4700 కోట్ల రూపాయలు ఈ ప్రాజక్టు కోసం ఖర్చు చేసిందని అన్నారు.
కేవలం కాంట్రాక్టుల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం ముందు చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు ఏ విధంగా జరుగుతోందో ఈ రోజు ప్రత్యక్షంగా చూశామని అన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఈ ప్రాజెక్టు పనులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే నాబార్డు నుంచి కూడా నిధులు తీసుకున్నారని అన్నారు.