metro: మెట్రో పిల్లర్లకి ఎలాంటి ప్రమాదం లేదు... స్పష్టతనిచ్చిన హెచ్ఎంఆర్ఎల్
- గచ్చిబౌలిలో పిల్లర్ కూలిపోయే దశలో ఉందంటూ ఫొటో వైరల్
- అధికారిక స్టేట్‌మెంట్ విడుదల చేసినా ఫొటోను నమ్ముతున్నారని వ్యాఖ్య
- అది పాకిస్థాన్‌లో తీసిందని, ఇష్టం లేని వాళ్లు వైరల్ చేస్తున్నారని ప్రకటన
గచ్చిబౌలిలో ఓ మెట్రోపిల్లర్ కూలిపోయే స్థితిలో ఉందంటూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో గురించి హైద్రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) స్పష్టతనిచ్చింది. అది నకిలీ ఫొటో అని, దాన్ని ఎవరూ నమ్మొద్దని కోరింది. ఆ ఫొటో పాకిస్థాన్‌లోని రావల్పిండిలో కట్టిన ఎలివేటెడ్ మెట్రో బస్ పిల్లర్ అని పేర్కొంది. ఈ విషయంపై హెచ్ఎంఆర్ఎల్, మంత్రి కేటీఆర్ చాలా సార్లు అధికారిక స్టేట్‌మెంట్లు విడుదల చేసినట్లు తెలిపింది.
ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ మెట్రో పిల్లర్లు చాలా గట్టివని, 21 రకాల ఒత్తిడులతో పాటు భూకంపాలను కూడా తట్టుకోగలవని వెల్లడించింది. అయితే మెట్రో విజయవంతం కావడాన్ని సహించలేని వారు ఇలాంటి ఫొటోలు సృష్టించి వైరల్ చేస్తున్నారని పేర్కొంది. గతేడాది నుంచే వైరల్ అవుతున్న ఈ ఫొటో మీద ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పష్టతనిచ్చారు. మళ్లీ ఇటీవల మెట్రో ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఫొటో మళ్లీ తెరమీదకి వచ్చింది.