rahul gandhi: అందుకే, మణిశంకర్ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకున్నాం: రాహుల్ గాంధీ
- గుజరాత్ శాసనసభ రెండో విడత ఎన్నికల ప్రచారంలో రాహుల్
- ప్రధాని పదవిని అలంకరించిన వ్యక్తిని మా పార్టీ గౌరవిస్తుంది
- ఆ పదవిలో ఉన్న వ్యక్తి గురించి పార్టీ తప్పుగా మాట్లాడదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కింది స్థాయి వ్యక్తి అంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసిన విషయం తెలిసిందే. తమ పార్టీకి ఇటువంటి వ్యాఖ్యలు చేసే సంస్కృతి లేదని కాంగ్రెస్ ఈ సందర్భంగా చెప్పుకుంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. గుజరాత్ శాసనసభ రెండో విడత ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తిని తమపార్టీ గౌరవిస్తుందని అన్నారు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి గురించి తమ పార్టీ తప్పుగా మాట్లాడదని చెప్పారు. అందుకే తాము మణిశంకర్ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కాగా, గుజరాత్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై బీజేపీ ఎన్నికల ప్రణాళిక రూపొందించలేదని రాహుల్ గాంధీ అన్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 10 రోజుల్లోనే రైతు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు. గుజరాత్లో రేపు తొలిదశ పోలింగ్ జరగనుంది.