Jayalalitha: జయలలిత మరణం.. వెలుగులోకి సంచలన విషయం!
- కమిషన్ ఎదుట నివ్వెరపోయే నిజాన్ని వెల్లడించిన వైద్య బృందం
- తాము అసలు జయను చూడనే లేదని వాంగ్మూలం
- 75 రోజులూ ఓ ప్రత్యేక గదిలోనే కాలక్షేపం చేశామన్న వైద్య బృందం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జయ మృతి మిస్టరీగా మారడంతో అసలు నిజం తెలుసుకునేందుకు జరుగుతున్న విచారణ మరో మలుపు తిరిగింది. జయలలితకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం తరపున నియమితులైన వైద్య బృందం నివ్వెరపోయే నిజాలను వెల్లడించింది. ఆసుపత్రిలో ఉన్న జయను తాము చూడనేలేదని, 75 రోజులపాటు ప్రత్యేక గదికే పరిమితమయ్యామని, ఉదయం గదిలోకి వెళ్లి సాయంత్రం వరకు కాలక్షేపం చేసి తిరిగి వచ్చేవారమని విచారణ కమిషన్ ఎదుట వైద్యులు వెల్లడించారు.
గతేడాది సెప్టెంబరు 22న జయలలిత స్వల్ప అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల తర్వాత డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం విషయంలో ‘ఏదో’ జరిగిందని అనుమానించిన ప్రతిపక్షాలు, ప్రజలు న్యాయవిచారణకు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి ఆధ్వర్యంలో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 27 మంది కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈనెల 12న ఆక్యుపంక్చర్ వైద్యుడు శంకర్, 13న జయ మేనకోడలు దీప, 14న ఆమె సోదరుడు దీపక్, 20న ప్రభుత్వ మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావులు హాజరుకానున్నారు.