homai: భారత తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌ను గుర్తు చేసిన గూగుల్
- డూడుల్‌తో హోమై వ్యారావాలాకి గౌరవం ఇచ్చిన సెర్చింజన్ దిగ్గజం
- ఈరోజు హోమై 104వ జయంతి
- సమీర్ కులవూర్ డిజైన్ చేసిన డూడుల్
దేశంలో మరుగున పడిన మాణిక్యాలను ఈ తరానికి డూడుల్ రూపంలో సెర్చింజన్ దిగ్గజం గుర్తుచేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై వ్యారావాలాను ఇవాళ గుర్తు చేసింది. గుజరాత్‌లోని నవసారి ప్రాంతంలో డిసెంబర్ 9, 1913న ఆమె జన్మించారు. ఈ డూడుల్‌ను ముంబైకి చెందిన సమీర్ కులవూర్ డిజైన్ చేశారు.
1947, ఆగస్టు 15న ఎగురవేసిన మొదటి జాతీయ పతాకం, మహాత్మగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల మొదటి ఫొటోలను ఈమె తీసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫొటో జర్నలిస్ట్‌గా హోమై కెరీర్ ప్రారంభించారు. తర్వాత 1942లో బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో ఉద్యోగిగా చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసే ఫొటోగ్రాఫర్ మానెక్ షా వ్యారవాలాను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1959లో అప్పటి దలైలామా సరిహద్దు దాటుతున్నప్పటి ఫొటోలను కూడా ఈమే తీశారు. ఇంకా తన జీవితంలో ఫొటో జర్నలిస్టుగా ఎన్నో సంఘటనలకు ఆమె దృశ్యరూపం కల్పించారు. 2012 జనవరి 15న 98 ఏళ్ల వయసులో హోమై తనువు చాలించారు.