vishal: ఆర్కే నగర్ వాసులకు కృతజ్ఞతలు... తమిళనాడు ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ
- తన నామినేషన్ తిరస్కరణ అనైతికమన్న నటుడు
- కన్యాకుమారి జాలరులను వెతికిపట్టుకోవడంపై దృష్టి సారించాలని మనవి
- కొత్త ఉత్తేజంతో రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్య
ఆర్కే నగర్ ఉపఎన్నికకు తాను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడం అనైతికమని నటుడు విశాల్ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు తానుగా నామినేషన్ వేశానని, ఎవరూ తనను ఒత్తిడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్కేనగర్ వాస్తవ్యులకు, నామినేషన్ వేయడంలో తనకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విశాల్ బహిరంగ లేఖ రాశారు.
'ప్రజలకు మనస్ఫూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను నామినేషన్ వేశాను. నాపై ఎవరి ఒత్తిడి లేదు. నేను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురవడం నిజంగా అనైతికం. దీన్ని బట్టి ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటో తమిళనాడు ప్రజలు అర్థం చేసుకోవచ్చు' అన్నారు. ఇప్పుడు తన నామినేషన్ విషయం కంటే దృష్టి సారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా తప్పిపోయిన కన్యాకుమారి జాలరులను వెతికి పట్టుకోవడంలో అందరూ సహకరించాలని విశాల్ కోరారు. అలాగే కొత్త ఉత్తేజంతో మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని పేర్కొన్నారు.