Pawan Kalyan: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయ్.. గుర్తుంచుకోండి: అమిత్ షా, బీజేపీలపై పవన్ కల్యాణ్ విమర్శలు
- బీజేపీలో చేరాలని అమిత్ షా ఆహ్వానించారు
- జాతీయ పార్టీలు బలంగా ఉంటే.. ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుడతాయి
- కేంద్రంలో నెంబర్ గేమ్ ఎంత డేంజరస్ గా ఉంటుందో మర్చిపోకండి
బీజేపీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకు హైదరాబాదులో అమిత్ షా తనను కలిశారని... ఆ సందర్భంగా ఆయన తనతో మాట్లాడుతూ, ఇకపై భారతదేశ భవిష్యత్తు ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉండదని, కేవలం జాతీయ పార్టీల చేతుల్లోనే ఉండబోతోందని... అందువల్ల బీజేపీలో చేరాలంటూ తనతో చెప్పారని తెలిపారు. అవకాశవాద రాజకీయ నాయకుడిగా తనను అర్థం చేసుకున్నారని... కానీ, తాను అలాంటివాడిని కాదని అన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
అధికారం లేకపోయినా, పేరు ప్రఖ్యాతులను కోల్పోయినా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోనని కార్యకర్తలను ఉద్దేశించి పవన్ చెప్పారు. "అమిత్ షా సార్... నేను బీజేపీలోనే చేరాలనుకుంటే జనసేనను ఎందుకు స్థాపిస్తాను?" అంటూ సభావేదిక నుంచి ప్రశ్నించారు. జాతీయ పార్టీలు చాలా బలంగా పని చేస్తే... ప్రాంతీయ పార్టీల అవసరమే లేదని అన్నారు. లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండవచ్చు, కానీ ఏపీ నుంచి బీజేపీ తరపున ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు కూడా గెలిచారన్న విషయాన్ని మర్చి పోరాదని... కేంద్రంలో నెంబర్ గేమ్ ఎంత డేంజరస్ గా ఉంటుందో అనే విషయాన్ని మర్చిపోరాదని సూచించారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.