vishal: సినీనటుడు విశాల్ నామినేషన్ను తిరస్కరించిన ఎన్నికల అధికారిపై వేటు!
- ఆర్కేనగర్ ఉప ఎన్నికకు విశాల్ నామినేషన్ తిరస్కరణ
- హై డ్రామా కొనసాగిన నేపథ్యంలో రిటర్నింగ్ అధికారిపై ఈసీ ఆగ్రహం
- కొత్త రిటర్నింగ్ అధికారిగా ఐఏఎస్ ప్రవీణ్ పి.నాయర్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికకు పోటీ చేయడానికి సినీనటుడు విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ నామినేషన్ లో తప్పులు ఉండడంతో తిరస్కరిస్తున్నామని చెప్పిన రిటర్నింగ్ అధికారి.. విశాల్ ధర్నాకు దిగిన అనంతరం మళ్లీ స్వీకరిస్తున్నామని తెలిపారు. మరికాసేపటికే మళ్లీ తిరస్కరిస్తున్నామని తెలిపి షాక్ ఇచ్చారు. హైడ్రామా కొనసాగిన నేపథ్యంలో సదరు అధికారి వేలుస్వామిపై వేటు పడింది.
ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త రిటర్నింగ్ అధికారిగా ఐఏఎస్ ప్రవీణ్ పి.నాయర్ నియమితులయ్యారు. విశాల్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన ఆ అధికారిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. కాగా, ఎన్నికల అధికారులు అధికార అన్నాడీఎంకే పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.