Gujarath: గుజరాత్ లో తగ్గిన పోలింగ్... బీజేపీలో ఆందోళన!
- ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్
- 68 శాతానికే పరిమితమైన పోలింగ్
- గత ఎన్నికల్లో 71.3 శాతం
- ఓటేసేందుకు తరలివచ్చిన యువత
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, 89 స్థానాలకు జరిగిన పోలింగ్ తక్కువగా నమోదు కావడం, అధికార బీజేపీలో ఆందోళన కలిగిస్తోంది. 2012 ఎన్నికల్లో 71.3శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ దఫా అది 68 శాతానికే పరిమితమైంది. పటేళ్ల ప్రాబల్యం ఉన్న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్, కచ్ ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగగా, 977 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలోకి చేరిపోయింది. ఓట్లు వేసిన వారిలో తొలిసారి ఓటు హక్కు తెచ్చుకున్న యువత అధిక సంఖ్యలో ఉండటం, రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీపై స్వతహాగా ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.
అయితే, ఓటింగ్ శాతం తగ్గినా, తమకు వచ్చిన నష్టమేమీ లేదని, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. భారీగా ఓటింగ్ జరిగితే తాము లాభపడతామని బీజేపీ భావించగా, ఓటింగ్ శాతం తగ్గడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత అధికంగా ఉందని, అందువల్లే ఓట్లు వేసేందుకు ప్రజలు ఆసక్తిని చూపలేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ మోద్వాడియా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించిన ఈసీ, ఆపై అటువంటిదేమీ లేదని తేల్చింది. ఇక ఓటేసిన వారిలో రాజ్ కోట్ (పశ్చిమ) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ, క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా, అధిక వయస్కురాలైన ఓటర్, అజిబెన్ చంద్రవాడియా (124) తదితరులు ఉన్నారు.