ISIS: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో యుద్ధం ముగిసింది.. ప్రకటించిన ఇరాక్
- ఐసిస్‌తో యుద్ధం ముగిసిందన్న ఇరాక్ ప్రధాని
- గత నెలలోనే ప్రకటించిన రష్యా
- ఉగ్రవాదుల చెర నుంచి దేశానికి విముక్తి లభించిందన్న ప్రధాని
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో యుద్ధం ముగిసిందని ఇరాక్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ దేశ ప్రధాని హైదర్ అల్-అబాదీ ప్రకటించారు. ఉగ్రవాదుల చెర నుంచి దేశానికి పూర్తిగా విముక్తి లభించిందని పేర్కొన్నారు. ఇరాక్‌ను స్థావరంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోయారు. మొత్తం ప్రపంచాన్నే భయపెట్టారు. ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా దానికి ఐసిస్‌తో సంబంధాలు ఉండేవి.
ఇరాక్‌లో వేళ్లూనుకున్న ఇస్లామిక్ స్టేట్ పీచమణచేందుకు 2014లో అమెరికా రంగంలోకి దిగింది. ఇరాక్ దళాలతో కలిసి సంయుక్త సేనలు ఐసిస్‌పై యుద్ధం ప్రకటించాయి. వారి స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తూ ఏరివేత మొదలుపెట్టాయి. ఐసిస్‌కు గట్టి పట్టున్న మోసుల్ నుంచి గత నెలలో ఉగ్రవాదులను పూర్తిగా తరమికొట్టిన సేనలు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించినట్టు ఇరాక్ ప్రకటించింది. సిరియాలో ఐసిస్ ఓటమి పాలైందని గత నెలలో రష్యా మిలటరీ ప్రకటించింది. ఇప్పుడు ఇరాక్ ప్రధాని హైదర్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు.