Bharath Reddy: అభంగపట్నం దళితులపై దాడి కేసులో ట్విస్ట్.. జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో బీజేపీ నేత భరత్ రెడ్డి?
- దళితును చావబాదిన బీజేపీ నేత
- షూటింగ్లో భాగమన్న యువకులు
- తాజాగా కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు
- అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు.. అరెస్ట్!
నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత భరత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో దళితులపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
మొరం అనుమతులు, తవ్వకాలపై భరత్ రెడ్డిని ప్రశ్నించిన దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లపై ఆయన దాడి చేశారు. కర్ర పట్టుకుని వారిని బాదుతూ, బూతులు తిడుతూ నీటిలోకి దింపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు ఆయనను అరెస్ట్ చేయాలంటూ రోడ్డెక్కాయి. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ ఘటన జరిగిన తర్వాత లక్ష్మణ్, రాజేశ్వర్లు అదృశ్యమయ్యారు. దీంతో భరత్ రెడ్డే వారిని కిడ్నాప్ చేసి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వారం రోజుల క్రితం లక్ష్మణ్, రాజేశ్వర్లు ఇద్దరూ హైదరాబాద్లో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. భరత్ రెడ్డి తమను దూషించలేదని, దాడి చేయలేదని, ఆ ‘సీన్’ అంతా ‘దొరల రాజ్యం’ సినిమా షూటింగ్లో భాగమని వివరించడంతో అందరూ విస్తుపోయారు.
అయితే, ఇద్దరూ అభంగపట్నానికి చేరుకున్న తర్వాత మరో ట్విస్టు ఇచ్చారు. భరత్ రెడ్డి తమను కిడ్నాప్ చేశాడని, ఆయన నుంచి ప్రాణ హాని ఉండడంతో సినిమా షూటింగ్ అని చెప్పాల్సి వచ్చిందని పేర్కొనడం మరోమారు సంచలనమైంది. వారి ఫిర్యాదుతో పోలీసులు అట్రాసిటీ, కిడ్నాప్ కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్న భరత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇప్పటి వరకు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.