Manohar parrikar: మెరుపు దాడులపై ఆసక్తికర విషయాలను బయటపెట్టిన మనోహర్ పారికర్!
- చివరి నిమిషంలో ఆయుధాలు కొనుగోలు చేశాం
- దాడుల ప్రణాళిక నుంచి నిర్వహణకు వరకు అంతా గోప్యం
- ఆ ఆలోచనతో నిద్ర పట్టేది కాదు..
- వెల్లడించిన నాటి రక్షణ మంత్రి
ఉరీ ఉగ్రదాడి తర్వాత గతేడాది సెప్టెంబరులో నియంత్రణ రేఖను దాటి మరీ పాకిస్థాన్‌లో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. ఈ మెరుపు దాడులకు పాక్ ఉక్కిరిబిక్కిరైంది. పాక్ సైనికులు, ఉగ్రవాదులు తేరుకునేలోపే మన సైనికులు పని కానిచ్చేసి వచ్చేశారు. అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. నాడు రక్షణ మంతిగా ఉన్న ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆసక్తిర విషయాలను వెల్లడించారు.
మెరుపు దాడులకు ముందు ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్‌కు అవసరమైన ఆయుధాలను చివరి నిమిషంలో కొనుగోలు చేశారని తెలిపారు. దాడులకు సంబంధించిన ప్రణాళిక, నిర్వహించిన తీరును మొత్తం రహస్యంగా ఉంచారని, ఆర్మీ చెప్పేంత వరకు ఈ విషయం బయటకు పొక్కలేదన్నారు.
ఉరీ ఉగ్రదాడికి భారత్ రెండు వారాల్లోనే సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో ప్రతీకారం తీర్చుకుంది. ఉరీలోని ఆర్మీ క్యాంపుపై దాడి చేసిన ఉగ్రవాదులు మొత్తం 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఏడు ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఉరీ ఉగ్రదాడికి, పీవోకేలో భారత్ మెరుపు దాడులకు మధ్య ఆర్మీ, రక్షణ శాఖ అధికారుల మధ్య 18 సమావేశాలు జరిగినట్టు పారికర్ వివరించారు. అయితే ఈ విషయాలేవీ బయటకు రాలేదన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో అనుకోనిది ఏదైనా జరిగితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తనకు తెలుసని, అందుకే ఆ సమయంలో తనకు నిద్ర కూడా సరిగా పట్టలేదని పారికర్ పేర్కొన్నారు.