Prakash Raj: ఆ పేరుతో బార్లు, వైన్ షాపులు ఉంటే తప్పులేదు కానీ.. ఈ సినిమాకే తప్పొచ్చిందా?.. ప్రకాశ్ రాజ్
- ‘సెక్సీ దుర్గ’ సినిమాపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న ప్రకాశ్ రాజ్
- కేరళ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం
- సమస్యలపై ఇటీవల తరచూ స్పందిస్తున్న విలక్షణ నటుడు
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోమారు గళమెత్తారు. తన అభిప్రాయలను నిక్కచ్చిగా చెప్పే ఆయన కేరళలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (ఐఎఫ్ఎఫ్కే) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. తనకు కేరళ అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడికి భయం లేకుండా రావచ్చని అన్నారు.
సనాల కుమార్ శశిధరన్ దర్శకత్వంలో నిర్మించిన ‘సెక్సీ దుర్గా’ సినిమా గురించి ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఈ సినిమా పేరుపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, కానీ వారికి ‘దుర్గా వైన్ షాప్.. బార్లు’ కనిపించవని విమర్శించారు.
తనను భయటపెట్టాలని చూస్తున్న వారిని చూస్తే నవ్వు వస్తుందని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన నుంచి వారు ఏమి తీసుకెళ్లగలరని ప్రశ్నించారు. తాను ఏ పార్టీకీ చెందిన వాడిని కాకపోవడం వల్లే సమస్యలపై ఇలా స్వేచ్ఛగా గళం విప్పగలుగుతున్నానని పేర్కొన్నారు. కాగా, ‘సెక్సీ దుర్గ’పై నిరసనలు వెల్లువెత్తడంతో సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆ సినిమా పేరును ‘ఎస్ దుర్గ’గా మార్చారు.
జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య నుంచి తన గళాన్ని వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ ఈ హత్య కేసు విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అలాగే పద్మావతి సినిమా వివాదంపైనా మాట్లాడారు.