nasa: గ్రహాంతర వాసులు ఉన్నారా?.... డిసెంబర్ 14న సంచలన ప్రకటన చేయనున్న నాసా
- 2009 నుంచి శోధిస్తున్న శాస్త్రవేత్తలు
- కెప్లర్ టెలిస్కోప్‌తో పరిశోధనలు చేస్తున్న నాసా
- గ్రహాంతర వాసుల గురించే ప్రకటన అంటూ వార్తలు
గ్రహాంతర వాసులు ఉన్నారా?... ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల వారికో కొత్త విషయం తెలిసిందట. ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి డిసెంబర్ 14న నాసా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కెప్లర్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలకి 2500కి పైగా భూమిని పోలిన గ్రహాలు కనిపించినట్లు సమాచారం.
అయితే వాటిలో ఏదో ఒక గ్రహంలో జీవం జాడలు కనిపించి ఉంటాయని, ఆ విషయాన్నే శాస్త్రవేత్తలు ప్రకటించబోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహాలన్నీ గోల్డీలాక్ జోన్లో పరిభ్రమిస్తున్నాయని, జీవజాలం అభివృద్ధి చెందడానికి ఈ గ్రహాల పరిస్థితులు అనుకూలిస్తాయని శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించారు. గూగుల్ సంస్థ అందించిన మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను నాసా అధ్యయనం చేసింది.