youtube: వయసు ఆరేళ్లు... మిలియన్లలో సంపాదన... యూట్యూబ్ పుణ్యమే!
- ఆట బొమ్మలు రివ్యూ చేసి లక్షలు సంపాదిస్తున్న ర్యాన్
- అత్యధికంగా సంపాదిస్తున్నవారి జాబితాలో ఎనిమిదో స్థానం
- 'ర్యాన్ టాయ్స్రివ్యూ' ఛానల్‌కి 10 మిలియన్ల సబ్స్క్రైబర్లు
ఇంటర్నెట్ యుగంలో డబ్బు సంపాదనకి చాలా మార్గాలున్నాయి. కొంత సృజనాత్మకత ఉంటే చాలు.. యూట్యూబ్ ద్వారా మిలియన్లు సంపాదించవచ్చు. అలా సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ర్యాన్ మాత్రం వారిలో ప్రత్యేకం. ఇతని వయసు ఆరేళ్లే... కానీ సంపాదన సంవత్సరానికి 11 మిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం 2017లో అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబర్లలో ర్యాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
ఇంతకీ ర్యాన్ ఏం చేస్తాడో తెలుసా?... తన 'ర్యాన్ టాయ్స్ రివ్యూ' ఛానల్లో కొత్త కొత్త ఆటబొమ్మలకు రివ్యూలిస్తుంటాడు. అందుకు తన తల్లిదండ్రులు ర్యాన్‌కి సహాయం చేస్తారు. మార్చి 2015 నుంచి ర్యాన్ వీడియోలు పెడుతూనే ఉన్నాడు. మొదట్లో పెద్దగా వీక్షణలు రాకపోయేవి, కానీ జులై 2015లో ర్యాన్ పెట్టిన 'కార్స్ జెయింట్ బాల్' బొమ్మ వీడియో వైరల్‌గా మారింది.
అంతే... ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఛానల్‌కి 10 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. కార్స్ జెయింట్ బాల్ వీడియోకి ఇప్పటి వరకు 801 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ ఛానల్ ద్వారా ర్యాన్‌కి నెలకు 1 మిలియన్ డాలర్ల సంపాదన అందుతోంది. అయితే ర్యాన్ రక్షణ, వ్యక్తిగత భద్రత దృష్ట్యా అతని తల్లిదండ్రులు పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.