Vijay Malya: సీబీఐ, ఈడీకి షాక్... తమ వాదనతో ఇరుకున పెట్టిన మాల్యా న్యాయవాదులు!
- ఏప్రిల్ 2016లో రూ. 4,400 కోట్లు ఆఫర్ చేసిన మాల్యా
- అప్పట్లో దాన్ని అంగీకరించని ఎస్బీఐ కన్సార్టియం
- మాల్యాను ఇబ్బందులు పెట్టాలనే అలా చేశారన్న డిఫెన్స్
ఇండియాలో న్యాయ విచారణ పారదర్శకంగా లేదని, తమ క్లయింట్ మాల్యా విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని చెబుతూ, మాల్యా తరఫున వాదనలు వినిపిస్తున్న మాంటొగొమెరీ న్యాయవాదులు, సాక్షులపై సమాధానాలు చెప్పలేని ప్రశ్నలను సంధిస్తూ, ఆయన్ను ఎలాగైనా వెనక్కు తీసుకురావాలని భావిస్తున్న సీబీఐ, ఈడీ అధికారులకు షాకిచ్చారు.
ఏప్రిల్ 6, 2016న బ్యాంకులకు తాను బకాయి పడ్డ మొత్తంలో రూ. 4,400 కోట్లు చెల్లిస్తానని విజయ్ మాల్యా బ్యాంకుల ముందుకు వచ్చారా? వస్తే మీరెందుకు ఆ డబ్బు తీసుకునేందుకు అంగీకరించ లేదు? ఆయన్ను మరింతగా అప్పులపాలు చేయాలన్న ఆలోచన మీకుందా? సమాధానాలు చెప్పండి? అంటూ ఆయన బకాయిపడ్డ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం తరఫున హాజరైన ప్రతినిధిని ఉక్కిరిబిక్కిరి చేశారు.
మాల్యాను ఇబ్బంది పెట్టాలనే గత సంవత్సరం చెల్లిస్తామన్న డబ్బును వారు అంగీకరించలేదని, అప్పట్లోనే దాన్ని తీసుకుని ఉంటే, ప్రాసిక్యూషన్ చెబుతున్నట్టు రూ. 9 వేల కోట్లకు బదులు, కేవలం రూ. 2 వేల కోట్లకు పైగా మాత్రమే మాల్యా బకాయి ఉండేవారని వాదించింది. ఈ కేసులో తమ క్లయింటును ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని, ఆయన్ను ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లి, జైల్లో పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని భావిస్తున్నారని ఆరోపించింది.
కాగా, భారత ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ స్పందిస్తూ, మాల్యా చెల్లించాల్సిన మొత్తంతో పోలిస్తే, అది తక్కువ కాబట్టే బ్యాంకులు అంగీకరించలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన పుట్టిన రోజు వేడుకలకే 2 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టినట్టు సాక్ష్యాలున్నాయని, అటువంటి వ్యక్తి మొత్తం డబ్బు చెల్లించలేనంటే ఎలా నమ్ముతారని అడిగారు. కేసు విచారణ నేటికి వాయిదా పడింది. మాల్యా అప్పగింత కేసు విచారణ గురువారం వరకూ సాగనుంది.