KCR: సమైక్య రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి ఉండేది!: కేసీఆర్
- ఇప్పుడు ఆ పరిస్థితి లేదు
- అప్పట్లో రైతులు ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారు
- ఇప్పుడు తీసేయాలి
- ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి రైతులకు 24 గంటల విద్యుత్
సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితి ఉండేదని, రాష్ట్రంలో ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు అందుబాటులో ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాపై హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు పోతోందో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆటోస్టార్టర్లను పెట్టుకున్నారని అన్నారు.
రైతులు నూరు శాతం తమ ఆటోస్టార్టర్లను తొలగించుకుంటే మంచిదని కేసీఆర్ అన్నారు. ఆటో స్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుకుపోయి రైతులకు మేలుకన్న కీడే ఎక్కువ జరుగుతుందని అన్నారు. ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించాలని ఆదేశించారు. 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల కలిగే లాభనష్టాలను ఎదురయ్యే సవాళ్లను ఈ సమావేశంలో కేసీఆర్ అధికారులతో చర్చించారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల కలిగే భారాన్నంతా సర్కారే భరిస్తుందని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే ఎత్తిపోతల పథకాలకయ్యే విద్యుత్ బిల్లులను కూడా సర్కారే పూర్తిగా చెల్లిస్తుందని తెలిపారు.