Bihar: పాట్నాకు నిలిచిపోయిన పెద్ద నోట్ల సరఫరా.. ప్రజల అష్టకష్టాలు!
- పాట్నాలో డీమోనిటైజేషన్ నాటి పరిస్థితులు
- ఆగిపోయిన పెద్ద నోట్ల సరఫరా
- గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసమేనని ఆర్జేడీ ఆరోపణ
బీహార్ రాజధాని పాట్నాలో పెద్ద నోట్లు రద్దయిన నాటి రోజులు మరోమారు కనిపిస్తున్నాయి. ఏటీఎంలకు రూ.500, రూ.2000 నోట్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్బీఐకి చెందిన దాదాపు 300కు పైగా ఏటీఎంలకు ఆర్బీఐ నుంచి సరఫరా ఆగిపోయింది. ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి మరోమారు డీమోనిటైజేషన్ను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వు బ్యాంకుతో మాట్లాడతామని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సయ్యద్ ముజఫర్ తెలిపారు.
పాట్నాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై విపక్షాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల కోసం ఇక్కడికి రావాల్సిన నోట్లను అక్కడికి తరలించారని ఆర్జేడీ ఆరోపించింది. ఇక్కడి నోట్లతో అక్కడ ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్జేడీ ఆరోపణలపై బీజేపీ నేత మంగళ్ పాండే స్పందించారు. ఆర్జేడీ గుజరాత్ ఫోబియాతో బాధపడుతోందని విమర్శించారు.