dawood ibrahim: దావూద్ గ్యాంగ్ లో అలజడి.. చోటా షకీల్ తిరుగుబాటు!
- దావూద్ ను కలవడానికి కూడా ఇష్టపడని షకీల్
- సయోధ్య కుదిర్చేందుకు ఐఎస్ఐ విఫల యత్నం
- అనీస్ ఇబ్రహీం వల్లే విభేదాలు
పాకిస్థాన్ కేంద్రంగా అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని శాసించిన దావూద్ గ్యాంగ్ లో చీలికలు వచ్చాయి. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. దావూద్ కు చోటా షకీల్ అత్యంత సన్నిహితుడు. ఇంకా చెప్పాలంటే రైట్ హ్యాండ్. డీ గ్యాంగ్ కార్యకలాపాల్లో కీలక పాత్ర చోటాదే. అలాంటి షకీల్ గత కొన్నాళ్లుగా దావూద్ కు వేరుగా కరాచీలో ఉంటున్నాడు. దావూద్ ను కలిసేందుకు కూడా షకీల్ ఆసక్తి చూపడం లేదట. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐఎస్ఐ చేసిన ప్రయత్నాలు కూదా విఫలమయ్యాయని సమాచారం. వీరిద్దరూ విడిపోతే భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించడం కష్టమవుతుందని ఐఎస్ఐ కీలక అధికారులు మధనపడుతున్నారట.
దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం వల్లే వీరిద్దరికి విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. డీ గ్యాంగ్ లో అనీస్ జోక్యం పెరిగిపోవడం చోటా షకీల్ జీర్ణించుకోలేకపోయాడని సమాచారం. మరోవైపు, తూర్పు ఆసియా దేశాల్లోని ముఖ్య అనుచరులతో ఇప్పటికే చోటా షకీల్ సమావేశం కూడా నిర్వహించాడట. డీ గ్యాంగ్ వల్లే గతంలో పాక్ ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు తెగబడింది.