amruta fadnavis: క్రిస్మస్ ఈవెంట్‌కి హాజరైన మహారాష్ట్ర సీఎం భార్య... విరుచుకుపడిన నెటిజన్లు
- 'హిందువై ఉండి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తావా?' అంటూ విమర్శలు
- గట్టిగా సమాధానం చెప్పిన అమృతా ఫడ్నవీస్
- సమాజానికి ఉపయోగపడే పనికి మతం రంగు పులమొద్దని వ్యాఖ్య
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ఇటీవల ఓ ఛారిటీ ఈవెంట్‌కి హాజరైంది. ముంబైలోని బిగ్ఎఫ్ఎమ్ రేడియోస్టేషన్ వారు 'శాంటా-కాంపైన్' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి అమృతా ఫడ్నవీస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు బహుమతులు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమ ప్రారంభవేడుకకు హాజరైన అమృతా ఫడ్నవీస్ ట్విట్టర్లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
అయితే ఈ ఫొటోలపై నెటిజన్లు మరోలా స్పందించారు. హిందువై ఉండి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తావా? అంటూ విమర్శించారు. అలా విమర్శించిన వారిలో జర్నలిస్టులు కూడా ఉండటం గమనార్హం. వీరందరికీ అమృతా ఫడ్నవీస్ గట్టిగా సమాధానం చెప్పారు. సమాజానికి ఉపయోగపడే పనికి ఇలా మతం రంగు పులమడం సబబు కాదని వ్యాఖ్యానించారు. తాను ఆ కార్యక్రమానికి హాజరయ్యేముందు బహుమతులు అందుకోనున్న పేదపిల్లల ముఖాలే కనిపించాయని, వారి కోసమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలిపారు.