theft: పారిస్ ఎయిర్ పోర్టులో భారీ చోరీ!
- రూ. 2.25 కోట్ల చోరీ
- ఎయిర్ పోర్ట్ నుంచి చాకచక్యంగా పరారీ
- గాలిస్తున్న పోలీసులు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఎయిర్ పోర్టులో భారీ చోరీ జరిగింది. 3 లక్షల యూరోలు (మన కరెన్సీలో రూ. 2.25 కోట్లు) ఉన్న రెండు సంచులను ఓ వ్యక్తి తస్కరించాడు. వివరాల్లోకి వెళ్తే, చార్లెస్ డి గాలే ఎయిర్ పోర్టుకు గత శుక్రవారం దాదాపు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి వచ్చాడు. ఎయిర్ పోర్టులో అటూ ఇటూ తిరుగుతూ 'లూమిస్ క్యాష్ మేనేజ్ మెంట్' కంపెనీ గదుల వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ రూమ్ ఓపెన్ చేసి ఉన్నట్టు గమనించి, క్షణాల్లో ఆ గదిలోకి వెళ్లి, అక్కడ ఉన్న రెండు డబ్బు సంచులను తీసుకుని చాకచక్యంగా పరారయ్యాడు. ఈ చోరీతో స్థానిక పోలీసులు షాక్ అయ్యారు. చోరీ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
మరోవైపు 'లే పారిసియన్' అనే స్థానిక పత్రిక ఈ చోరీ గురించి ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇది పర్ ఫెక్ట్ క్రైమ్ అంటూ పేర్కొంది. 'ఆగంతుకుడు అదృష్టవంతుడు' అంటూ వ్యాఖ్యానించింది. క్రిస్మస్ కు రెండు వారాల ముందే పండగ చేసుకుంటున్నాడంటూ తెలిపింది. మరోవైపు, ఈ చోరీ వెనుక కంపెనీ సిబ్బంది హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినా, నిందితుడి ఆచూకీ తెలియడం లేదని సమాచారం.