MS Dhoni: మూడేళ్ల తర్వాత ఓ వివాదాస్పద ట్వీట్‌కి లైక్ కొట్టిన ధోనీ!
- ఎనిమిదేళ్లలో మూడు లైకులు మాత్రమే
- మ్యాచ్‌ఫిక్సింగ్ వార్తకు సంబంధించిన ట్వీట్‌కి ధోనీ లైక్
- చర్చనీయాంశంగా మారిన లైక్
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ట్విట్టర్ ఖాతాను 2009 నవంబర్‌లో తెరిచారు. ఎనిమిదేళ్ల ట్విట్టర్ ప్రస్థానంలో ధోని 445 ట్వీట్లు చేసి, 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అయితే ఆయన ఇతర ట్వీట్లకు లైక్ కొట్టడం మాత్రం చాలా అరుదు. ఇటీవల ధోనీ ఓ ట్వీట్‌కి లైక్ కొట్టారు. తన ట్విట్టర్ ఖాతాతో ధోనీ కొట్టిన మూడో లైక్ ఇది. 2013, మార్చి 10న జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్‌కి మొదటి లైక్, 2014, డిసెంబర్ 31న బీసీసీఐ చేసిన ట్వీట్‌కి రెండో లైక్ కొట్టారు.
ప్రస్తుతం ఓ వివాదాస్పద అంశానికి సంబంధించిన వార్త ట్వీట్‌కు ధోనీ మూడో లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ హిందీ వార్తా వెబ్‌సైట్ ఇండియన్ న్యూస్ వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఇన్‌ఖబర్ చేసిన ట్వీట్‌కి ధోనీ లైక్ కొట్టారు. ఈ ట్వీట్‌లో 2019 ఐసీసీ వరల్డ్ కప్‌ను విరాట్ కోహ్లీ సేన గెలుచుకోనుందని, దీనికి సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిందని ఉంది. ఈ ట్వీట్‌లో కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రి, బీసీసీఐ, గంగూలీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, అనురాగ్ ఠాకూర్, రాజీవ్ శుక్లా, శరద్ పవార్, గౌతమ్ గంభీర్, అజయ్ జడేజాలను ఇన్‌ఖబర్ ట్యాగ్ చేసింది.
అంతేకాదు.. ధోనీ తమ ట్వీట్‌ను లైక్ చేశాడంటూ పెద్ద వార్త రాసి, మరో ట్వీట్‌లో ఇన్‌ఖబర్ పేర్కొంది. మరి వారు ట్వీట్ చేసిన వార్తలో నిజముందా? లేదా? అనే విషయం పక్కనపెడితే, ధోనీ ఆ ట్వీట్‌ను లైక్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.