Nara Lokesh: ఏపీతో గూగుల్ ఎక్స్ చారిత్రక ఒప్పందం.. సంతకాలు చేసిన లోకేశ్, గూగుల్ ఎక్స్ సీఈవో!
- విశాఖలో గూగుల్ ఎక్స్ కార్యాలయం
- ఏపీ వ్యాప్తంగా 2 వేల ఫ్రీస్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ఏర్పాటు
- అమెరికా తర్వాత ఏపీలోనే గూగుల్ ఎక్స్ కార్యాలయం
- ప్రజలకు మరింత చవగ్గా అందనున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. శాన్ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ ఎక్స్ సీఈవో ఒప్పందాలపై సంతకాలు చేశారు. తాజా ఒప్పందం ప్రకారం ఏపీలో గూగుల్ ఎక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలోని మరో దేశంలో గూగుల్ ఎక్స్ ఇంతవరకు కార్యకలాపాలు ప్రారంభించలేదు. భారత్‌లో అడుగుపెడుతూనే ఏపీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండడం విశేషం.
విశాఖపట్టణంలో అతి త్వరలో గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫైబర్‌గ్రిడ్ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా అతి తక్కువ ధరకే గ్రామీణ ప్రాంత ప్రజలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గూగుల్ ఎక్స్ రాకతో కమ్యూనికేషన్ రంగంలో భారీ మార్పులు సంభవిస్తాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తామన్నారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు.