bollywood: బాలీవుడ్ నిర్మాతలకు మంత్రి మేనకా గాంధీ లేఖ... హార్వీ వీన్‌స్టెన్ వివాదమే కారణం!
- హాలీవుడ్లో సంచలనం రేపిన నిర్మాత లైంగిక వేధింపులు
- అలాంటివి దేశంలో జరగకుండా చూడాలని వ్యాఖ్య
- మహిళలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
హాలీవుడ్లో తమను ప్రముఖ నిర్మాత హార్వీ వీన్‌స్టెన్ లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఎందరో హాలీవుడ్ నటీమణులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు భారత చిత్ర పరిశ్రమలో జరగకుండా చూడాలని, తమ సంస్థల్లో పనిచేసే మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ బాలీవుడ్ నిర్మాతలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ లేఖ రాశారు. దాదాపు 24 నిర్మాణ సంస్థలకు ఆమె లేఖ రాశారు.
అందులో బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరణ్ జొహార్, ఆదిత్య చోప్రా, అనురాగ్ కశ్యప్, భూషణ్‌కుమార్, వినోద్ చోప్రా, మహేశ్ భట్, సూరజ్ బర్జాత్యా, అనిల్ అంబానీ, అజిత్ అంధారే, ఫర్హాన్ అక్తర్, శోభు యార్లగడ్డ, సంజయ్ లీలా భన్సాలీ, సుభాష్ ఘాయ్ తదితరులకు చెందిన నిర్మాణ సంస్థలు ఉన్నాయి.
నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోవాలని, మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత సంస్థ యాజమాన్యంపైనే ఉంటుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇటీవల నటి రిచా చద్దా తన కెరీర్ విషయంలో రక్షణ కల్పిస్తే తనను వేధించిన వారి పేర్లు బయటపెడతానని చెప్పారు. కానీ ఆ మరుసటి రోజే తాను ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదని, ఈ విషయంలో తనను ఎలాంటి ప్రశ్నలు వేయొద్దని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మేనక నిర్మాణ సంస్థలకు లేఖ రాయడం గమనార్హం.