gujarat elections: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్న డ్రాగన్ చైనా
- బీజేపీ గెలవాలని ఆశిస్తోన్న చైనా సర్కారు
- మోదీ సంస్కరణలు కొనసాగాలంటే గుజరాత్ లో గెలుపు అవసరం
- చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై చైనాలోనూ ఉత్కంఠ నెలకొంది. అక్కడి ప్రభుత్వం, పరిశీలకులు ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? లేదా? అని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ప్రధాని మోదీ సంస్కరణల అజెండా పట్ల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నదీ తాజా ఎన్నికల ఫలితాల్లో తేలిపోనుందని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
మరి చైనాకు గుజరాత్ ప్రజల అభిప్రాయాల అవసరం ఏమొచ్చిందన్న సందేహం రావచ్చు. ఎందుకంటే భారత మార్కెట్ పై డ్రాగన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మన దేశంతో చైనా ఇటీవలి కాలంలో ఆర్థిక సహకారం పెంచుకుంటూ ఉంటుండడంతో మోదీ సర్కారు చేపట్టిన సంస్కరణల అజెండాపై ఆసక్తితో ఉందని చైనా ప్రభుత్వ ఆద్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. భారతదేశ సంస్కరణల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే ఆ ప్రభావం ముందుగా పడేది చైనా మీదేనని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
చైనా కంపెనీలు షావోమీ, ఒప్పో మన దేశంలో పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ గుజరాత్ లో ఓడితే అది సంస్కరణలకు పెద్ద వెనుకడుగు అవుతుందని ఆ కథనంలో ఉంది. గుజరాత్ లో బీజేపీకి మెజారిటీ తక్కువ వచ్చినా అది ప్రభావం చూపిస్తుందని అభివర్ణించింది. మోదీ సర్కారు సంస్కరణలు సామాన్యులకు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించాయా? అనే దానిపై ప్రజల్లో అనుమానాలున్నాయని పేర్కొంది. ప్రభుత్వం తన సంస్కరణలకు ప్రజల ఆమోదం పొందే మార్గాన్ని తప్పకుండా కనుగొనాల్సి ఉందని సూచించింది.