vidya sagar: తెలుగు భాష సామాన్యమైంది కాదు: మహారాష్ట్ర గవర్నర్
- భారత్‌లో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు
- దేశంలోని చాలా ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు
- తెలుగు భాషాభిమానులను చూస్తోంటే హృదయం ఉప్పొంగుతోంది
తెలుగు భాష సామాన్యమైంది కాదని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. భారత్‌లో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగని అన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని అన్నారు. ఎంతో అద్భుతమైన సాహిత్యం తెలుగు భాష సొంతమని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా మొదటి రోజు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తోన్న కార్యక్రమంలో విద్యాసాగర్‌రావు ఉపన్యసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నడిబొడ్డున ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తాను కలలు కన్నానని తెలిపారు. ఈ రోజు ఇక్కడ తెలుగు భాషాభిమానులను చూస్తోంటే తన హృదయం ఉప్పొంగుతోందని అన్నారు. కోటి రతనాల వీణ తెలంగాణ అని దాశరథి కీర్తించారని అన్నారు. తెలంగాణ కవులు, కళాకారుల గురించి ఎక్కువగా ఎవ్వరికీ తెలియదని చాలామంది అనుకునేవారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాత్రం తెలంగాణ కవుల, కళాకారుల పేర్లు వికసిస్తున్నాయని అన్నారు.