Venkaiah Naidu: మనసులో ఎంతో ఆవేదనతో చెబుతున్నాను.. అలా కానివ్వద్దు: వెంకయ్య నాయుడు
- మాతృభాషను మృత భాష కానివ్వకూడదు
- రాబోయేతరంలో తెలుగు భాష ఏం కాబోతుంది?
- మాతృభాషను మనం మర్చిపోతే మన అస్థిత్వమే కనపడకుండా పోతుంది
- మాతృభాష అంతరించి పోవడం ఏ మాత్రం మంచిది కాదు
తెలుగు భాషను మర్చిపోవద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగువారిని కోరారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... "మాతృ భాషను మృత భాష కానివ్వకూడదు. మనసులో ఎంతో ఆవేదనతో చెబుతున్నాను నేను. నాకిప్పుడు 68 ఏళ్లు. నాకీవయసులో అనిపిస్తుంటుంది.. రాబోయేతరం మన మనవళ్లు, మనవరాళ్ల హయాంలో తెలుగు భాష ఏం కాబోతుంది? కేవలం తెలుగుకే కాదు ఈ పరిస్థితి.. మొత్తం దేశానికి అంతా కూడా.
మాతృ భాషలో బోధన జరిగితే, మాతృ భాషకు పరిపాలనలో ప్రాధాన్యతనిస్తే మన భాష, సంస్కృతి నిలబడతాయి. మాతృభాషను మనం మర్చిపోతే మన అస్థిత్వమే కనపడకుండా పోతుంది. మన భాష, మన యాస అంతరించి పోవడం ఏ మాత్రం మంచిది కాదు. భాష ద్వారా నాగరికత వస్తుంది. సామాజిక పరిణామంలో భాష ఇరుసు వంటిది. భాష, యాసను మర్చిపోతే కన్నతల్లిని మర్చిపోయినట్లే" అని అన్నారు.