hyderabad: పాకిస్థాన్ లో హైదరాబాదీ మహిళ నరకయాతన... టికెట్ కొనిచ్చి ఆదుకున్న సుష్మాస్వరాజ్!
- పాకిస్థాన్ లో హైదరాబాద్ మహిళకు వేధింపులు
- భారత్ కు వచ్చేందుకు వీసా మంజూరు చేయించిన సుష్మ
- డబ్బుల్లేవని తెలియడంతో టికెట్ కూడా ఉచితంగా అందించే ఏర్పాటు
విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. భారతీయులు విదేశాల్లో ఎక్కడ చిక్కుకుపోయినా, కష్టాలు పడుతున్నట్టు తెలిసినా ఆమె నేనున్నానంటూ ముందుకు రావడం గతంలో పలు సందర్భాల్లో వ్యక్తమైంది. తాజాగా పాకిస్థాన్ లో భర్త చేతిలో వేధింపులకు గురవుతున్న ఓ హైదరాబాదీ మహిళను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు సుష్మాయే నడుం బిగించారు. అంతేకాదు, టికెట్ కొనేందుకు డబ్బులు కూడా లేవని తెలియడంతో సుష్మాస్వరాజ్ ఈ ఏర్పాటు కూడా తానే చేశారు.
హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ బేగం 1996లో ఓ పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లాడి ఆ దేశం వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత భర్త ఆమెను చిత్ర హింసలకు గురి చేయడంతోపాటు భారత్ లో ఉన్న తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా నిర్బంధానికి గురి చేశాడు. ఈ విషయాన్ని మొహమ్మద్ బేగం తండ్రి అక్బర్ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెకు వీసా జారీ చేయించారు. టికెట్ కు డబ్బుల్లేవని తెలియడంతో అది కూడా ఉచితంగానే అందించే ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సుస్మాస్వరాజ్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.