Tamilnadu: అభాసుపాలైన తమిళనాడు గవర్నర్... స్నానాల గదిలోకి తొంగిచూశారంటూ వార్తలు!
- ఖండించిన రాజభవన్ వర్గాలు
- ఓ కాలనీలో ఆకస్మిక తనిఖీ చేసిన భన్వరీలాల్ పురోహిత్
- మరుగుదొడ్డి, స్నానాల గదుల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు
ఆకస్మిక తనిఖీలో భాగంగా గవర్నర్ స్నానాల గదిలోకి తొంగిచూశారని, ఆ సమయంలో ఓ మహిళ స్నానం చేస్తోందని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ గురించి అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాజ్‌భవన్ వర్గాలు అధికారిక వివరణ ఇచ్చినప్పటికీ ఈ విషయం గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే... కడలూరు జిల్లాలో అధికారిక సమీక్షల కోసం శుక్రవారం బయల్దేరిన గవర్నర్ భన్వరీలాల్‌కు వండిపాళయం వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఓ కాలనీ కనిపించింది. ఆకస్మిక తనిఖీలో భాగంగా అక్కడి మరుగుదొడ్లను పరిశీలించారు. ఓ మరుగుదొడ్డి పక్కన తడికెలతో కట్టిన దొడ్డిలోకి కూడా ఆయన తొంగిచూశారు. అక్కడ తడికెల మాటున స్నానం చేస్తున్న మహిళ కనిపించడంతో కంగుతిన్నారు. ఎవరో వృద్ధుడు వచ్చాడని భావించిన ఆ మహిళ, చీరను మీద కప్పుకుని గట్టిగా అరుచుకుంటూ ఇంట్లోకి పారిపోయింది. కానీ గవర్నర్ ఇవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటన గురించి రాజ్‌భవన్ ఇచ్చిన వివరణ మరోలా ఉంది. స్నానాల గదిలో ఎవరూ లేరని, తనిఖీ చేసేటపుడు మహిళా డీఆర్వో, కలెక్టర్లు చూసిన తర్వాతనే గవర్నర్ అక్కడ తనిఖీ చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తలు ప్రసారం చేసేముందు ఒకసారి సరి చూసుకోవాలని మీడియాను కోరింది.