bitcoin: బిట్‌కాయిన్‌కి కూడా వస్తుసేవల పన్ను?
- యోచిస్తోన్న కేంద్ర ప్రభుత్వం
- బిట్‌కాయిన్ ద్వారా సంపాదిస్తున్న వారు పన్ను ఎగ్గొడుతున్నారని అనుమానం
- పరోక్ష పన్నుల కిందకి రాని కారణంగా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం
బిట్‌కాయిన్... గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొన్నీమధ్య ఒక బిట్‌కాయిన్ విలువ 16వేల డాలర్లకు చేరడంతో భవిష్యత్‌లో కూడా ఇంకా పెరుగుతుందనే ఆశతో చాలామంది ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ పెట్టుబడుల వంకతో వారు అధికంగా సంపాదించి పన్ను ఎగవేసే అవకాశం ఉంది కనుక ఈ డిజిటల్ కరెన్సీని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ బిట్‌కాయిన్ లాభం పరోక్ష పన్నుల పరిధిలోకి రాదు కాబట్టి వస్తుసేవల పన్ను రూపేణ దీని మీద పన్ను వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి దేశంలోని ప్రధాన బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజీలపై పరోక్ష పన్నుల శాఖ అధికారులు సర్వే కూడా చేపట్టారు. జీఎస్టీలో ఏ పన్నురేటు కింద దీనిని చేరిస్తే బాగుంటుందని ఆయా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలను వీరు తెలుసుకున్నట్లు సమాచారం.