Goa: గోవాలో కొత్త రూల్.. 'తోడు' కావాలంటే ఆధార్ ఉండాల్సిందే!
- అన్ని వివరాలు సేకరించిన తర్వాత డీల్
- పోలీసు దాడుల నుంచి తప్పించుకునేందుకు ‘పింప్స్’ కొత్త ఎత్తుగడ
- ఆశగా వచ్చిన 90 శాతం మంది మోసపోతున్నారన్న పోలీసులు
బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పుడు గోవాలో అడుగుపెట్టే పర్యాటకులు కూడా వెంట ఆధార్ కార్డును తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ లేకుండా ‘పెయిడ్ సెక్స్’కు అక్కడి ‘పింప్స్’ అంగీకరించడం లేదట. ఇటీవల ఢిల్లీ నుంచి గోవా వెళ్లిన ఐదుగురు యువకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
గోవాలో పార్టీ జరుపుకునేందుకు వెళ్లిన యువకులు నార్త్ గోవాలో బీచ్ ఒడ్డున ఓ హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఐదుగురు యువతులు కావాలంటూ ఆరా తీశారు. ‘పింప్స్’కు సంబంధించిన ఓ వ్యక్తి వారికి వెంటనే అందుబాటులోకి వచ్చాడు. యువకుల సెల్‌ఫోన్ నంబర్లను పరిశీలించిన వారు ఢిల్లీ నుంచి వచ్చిన విషయం నిజమేనని నిర్ధారించుకున్నాడు. అనంతరం వారికి ఫోన్ చేసి ఫొటోలు, ఆధార్ నంబర్లను వాట్సాప్ ద్వారా పంపించాల్సిందిగా కోరాడు. అలాగే వారుంటున్న హోటల్ గది తాళాన్ని ట్యాగ్‌తో సహా ఫొటో తీసి పంపాల్సిందిగా సూచించాడు. దీంతో విస్తుపోవడం యువకుల వంతైంది.
ప్రస్తుతం ఇక్కడి ‘బిజినెస్’పై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘కస్టమర్లు’ పోలీసులు కాదన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకే వారిలా అన్ని వివరాలు సేకరిస్తున్నట్టు చెబుతున్నారు.
అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్న ‘పింప్స్’ నిర్వాహకులు అమ్మాయిలను ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పంపడం లేదని, ఒకేసారి వారంతా పట్టుబడితే తమ వ్యాపారం పడిపోతుందన్న భయమే అందుకు కారణమని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
గోవాకు వచ్చిన టూరిస్టుల్లో దాదాపు 90 శాతం మందిని ఎస్కార్ట్స్ వెబ్సైట్లు మోసం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.4వేల వరకు తీసుకుంటున్న నిర్వాహకులు వారిని పచ్చిగా మోసం చేస్తున్నారని వివరించారు.