Karnataka: షాకింగ్!: దాహమేసిన విద్యార్థులకు ‘మందు’ బాటిళ్లు ఇచ్చిన ఉపాధ్యాయులు!
- కర్ణాటకలోని తుముకూరులో ఘటన
- మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని గురువులు
- నీళ్లు అడిగితే లిక్కర్ పంపిణీ
కర్ణాటకలోకి తుముకూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దాహంతో అల్లాడిపోతున్న విద్యార్థులకు నీళ్లకు బదులు లిక్కర్ ఇచ్చారు. ఈ ఘటనలో స్కూలు ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో ఇద్దరిని అధికారులు సస్పెండ్ చేశారు.
హసన్ సమీపంలోని బొమ్మలదేవి పురలో ఈనెల 10న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ కన్నడలోని పర్యాటక ప్రాంతాలను చూపించేందుకు 8,9, 10 తరగతుల విద్యార్థులను తీసుకెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు తమకు దాహంగా ఉందని, నీళ్లు కావాలని విద్యార్థులు అడిగారు. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న ప్రధానోపాధ్యాయుడు సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులకు నీళ్లు కలిపిన లిక్కర్ బాటిళ్లను అందించారు.
దాహంతో ఉన్న విద్యార్థులు వాటిని గటగటా తాగేశారు. దీంతో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, కొందరు నడవడానికి ఇబ్బంది పడ్డారు. ఇంటికొచ్చిన విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీకి ఫిర్యాదు చేశారు. విషయం పై అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రధానోపాధ్యాయుడు సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.