Airtel: ఎయిర్‌టెల్‌కు కోలుకోలేని షాక్: ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్ రద్దు!
- ఖాతాదారుల అనుమతి లేకుండానే పేమెంట్స్ బ్యాంకులో ఖాతా
- వంటగ్యాస్ సబ్సిడీ మళ్లింపు
- 23 లక్షల ఖాతాల నుంచి రూ.47 కోట్లు పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లోకి..
- కఠిన చర్యలు ప్రారంభించిన యూఐడీఏఐ
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆధార్‌ను దుర్వినియోగం చేసినందుకు గాను ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సస్పెండ్ చేసింది. తక్షణమే ఇది అమలవుతుందని పేర్కొంది. యూఐడీఏఐ నిర్ణయంతో ఈ రెండు సంస్థలు తమ ఖాతాదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు తక్షణం ఫుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా ఎయిర్‌టెల్ తన ఖాతాదారుల ఆధార్ నంబర్లను సిమ్‌తో అనుసంధానించే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది.
ఇక, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు కూడా ఈ-కేవైసీ ఆధారంగా కొత్తగా ఖాతాదారులను చేర్చుకునే అవకాశాన్ని తాత్కాలికంగా కోల్పోయింది. వినియోగదారుల అనుమతితో పనిలేకుండా ఈ-కేవైసీ ద్వారా తమ మొబైల్ వినియోగదారుల పేరిట పేమెంట్ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్టు యూఐడీఏఐకి ఫిర్యాదులు అందాయి. వినియోగదారుల అనుమతి లేకుండా వారి పేర్లతో పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ఎయిర్‌టెల్.. వినియోగదారుల ఖాతాల్లో పడే వంట గ్యాస్ సబ్సిడీని తమ పేమెంట్స్ బ్యాంకులో జమ అయ్యేలా చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన అధికారులు ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తమ పేరిట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా ఓపెన్ అయిందన్న విషయం తెలియకపోవడం. ఇలా మొత్తం 23 లక్షల మందికిపైగా ఖాతాదారుల నుంచి దాదాపు రూ.47 కోట్ల వరకు జమ అయ్యాయి.