rk nagar: సీన్ రిపీట్.. ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపకం!
- ఆర్కే నగర్ లో ఓటర్లకు డబ్బు పంపిణీ
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
- అన్నాడీఎంకే, దినకరన్ వర్గీయుల మధ్య ఘర్షణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందడి ఊపందుకుంది. అన్ని పక్షాల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ, కొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 12.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట్ లోని ఓ సైకోథెరపీ సెంటర్ లో డబ్బులు దాచారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
ఈ క్రమంలో డబ్బులు పంచుతుండగా కొందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది శశికళ బంధువు దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు ఉద్రిక్తతలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ ఎన్నికలు ఏప్రిల్ 12నే జరగాల్సి ఉంది. భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరిగిన నేపథ్యంలో, అప్పుడు ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే నెలకొనడం గమనార్హం. డిసెంబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది.