Narendra Modi: మరికాసేపట్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. పది గంటలకు తొలి ఫలితం!
- హోరాహోరీగా సాగిన ఎన్నికలు
- రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీదే గెలుపన్న ఎగ్జిట్ పోల్స్
- అయినా కొనసాగుతున్న ఉత్కంఠ
ఇటీవల ముగిసిన హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం పది గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ మొదలైన గంటారెండు గంటల్లోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిందీ తెలిసిపోతుంది.
ఇదిలా ఉంచితే, ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే మొగ్గుచూపాయి. నిజానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా, గుజరాత్లో 37, హిమాచల్‌ప్రదేశ్‌లో 42 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. గాలి మళ్లీ బీజేపీ వైపు మళ్లింది.