Gujarath: ఇటీవలి కాలంలో ఎన్నడూ కచ్చితత్వం చూపని ఎగ్జిట్ పోల్స్... అదే కాంగ్రెస్ ధైర్యం!
- మొదలైన ఎన్నికల కౌంటింగ్
- రెండు రాష్ట్రాలూ బీజేపీవేనన్న ఎగ్జిట్ పోల్స్
- గతంలో తప్పయిన అంచనాలు
- గెలుపు తమదేనంటున్న బీజేపీ, కాంగ్రెస్
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. గుజరాత్ లో వరుసగా ఆరోసారి విజయం సాధిస్తామన్న ఆలోచన బీజేపీలో ఉండగా, ఈ దఫా బీజేపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్ పై కాంగ్రెస్ ఎలాగూ ఆశలు పెట్టుకోలేదని ముందు నుంచే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు.
దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ కోడై కూసినా, ఇటీవలి కాలంలో ఎగ్జిట్ పోల్స్ కచ్చితంగా ఫలితాలను గురించి విశ్లేషించిన దాఖలాలు లేవు. ఇటీవలి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినట్టుగా ఓట్లను సాధిస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. సమాజ్ వాదీ, కాంగ్రెస్ కూటమి, మధ్యలో బీఎస్పీ, బీజేపీ కూటమి పోటీ పడగా, బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అంతకుముందు జరిగిన బీహార్ ఎన్నికల్లో సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహా కూటమి విజయం సాధిస్తుందని చెప్పిన సర్వే సంస్థలు అతి తక్కువ. దానికన్నా ముందు జరిగిన ఢిల్లీ ఎన్నికల విషయంలోనూ అదే జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసిన సంస్థే కనిపించలేదు. ఇక పలు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా పడటంతో, ఈ దఫా కొంతమంది బీజేపీ నేతలే బాహాటంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
గుజరాత్ లో మొత్తం 182 స్థానాలుండగా, 1828 మంది అభ్యర్థుల భవితవ్యం నేటి మధ్యాహ్నానికి తేలుతుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 92. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే, 68 స్థానాల నుంచి 337 మంది బరిలో నిలిచారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ విషయంలో బీజేపీ 35 సీట్ల మార్క్ ను చేరుకుంటుందనడంలో సందేహం లేదనే చెప్పవచ్చు. ఎటొచ్చీ గుజరాత్ ఓటర్ల నాడి ఎలా ఉందన్నదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం.