Tirumala: తిరుమలలో మారిన దర్శన విధానం... సూపరంటున్న భక్తులు!
- టైమ్ స్లాట్ విధానాన్ని ప్రారంభించిన టీటీడీ
- 14 ప్రాంతాల్లో 111 కౌంటర్ల ఏర్పాటు
- సంతృప్తిని వ్యక్తం చేస్తున్న భక్తులు
తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో వినూత్న విధానం నేటి నుంచి అమలులోకి వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనాన్ని ఈ ఉదయం టీటీడీ ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, భక్తుల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది. ఈ ఉదయం టోకెన్ల జారీ కేంద్రాలకు ఉదయం 6 గంటలకు పూజలు చేసి, భక్తులకు సమయాన్ని కేటాయించే విధానాన్ని ఈఓ ప్రారంభించారు. ఆపై ఒకేసారి 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 111 కౌంటర్ల నుంచి సమయాన్ని జారీ చేసే విధానాన్ని మొదలు పెట్టారు.
ఈ కొత్త పధ్ధతితో భక్తులు తమకు కేటాయించిన సమయానికి దర్శనానికి వెళితే, రెండు గంటల్లోనే బయటకు వచ్చేయవచ్చు. గరిష్ఠంగా మూడు గంటలకన్నా అధిక సమయం క్యూ లైన్లలో గడపాల్సిన అవసరం లేకుండా చేశామని టీటీడీ అధికారులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భక్తులు సైతం ఈ విధానం బాగుందని కితాబిస్తున్నారు. కాగా, ఆధార్ కార్డులు వెంట తెచ్చుకోని వారికి ఈ విధానంలో టోకెన్లను జారీ చేయబోమని అధికారులు తేల్చి చెప్పడంతో కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు.