BJP: అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, తోమర్ లకు కొత్త సీఎంల ఎంపిక నిర్వహణ బాధ్యతలు!
- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ విజయం
- గుజరాత్ సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి
- హిమాచల్ ప్రదేశ్కు సీఎంను ఎంపిక చేసే బాధ్యత నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్లకు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సీఎంలను ఎంపిక చేసే పనిలో పడింది బీజేపీ అధిష్ఠానం. ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై చర్చించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పలువురు సీనియర్ నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గుజరాత్ సీఎం ఎంపిక నిర్వహణ బాధ్యతను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎంపిక నిర్వహణ బాధ్యతను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్లకు అప్పజెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఇతర నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.
కాగా, గత ఏడాది ఆగస్టు 7న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రూపానిని మళ్లీ ఆ రాష్ట్రానికి సీఎంగా చేసేందుకు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతుందా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.