Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్!

  • అధికారులు, ఎల్ అండ్ టి, మెగా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం
  • పర్యావరణ అనుమతి సాధించడంతో ప్రాజెక్టు అతి కీలకమైన మైలురాయిని దాటింది 
  • ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదు
  • నిర్మాణంలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే అటవీశాఖ మొదటి, రెండవ దశ అనుమతులు సాధించిన ప్రాజెక్టుకు, ఇప్పుడు అతి కీలకమైన పర్యావరణ అనుమతులు వచ్చాయని, ఇది తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అని సిఎం ప్రకటించారు. పర్యావరణ అనుమతి సాధించడంతో ప్రాజెక్టు అతి కీలకమైన మైలురాయిని దాటిందని సిఎం అభిప్రాయపడ్డారు.

పర్యావరణ అనుమతులు రావడాన్ని సానుకూలాంశంగా తీసుకుని ద్విగుణీకృత ఉత్సాహంతో పనులు చేయాలని నీటి పారుదల శాఖను సీఎం కోరారు. దశాబ్దాల తరబడి ఎదుర్కొన్న సాగునీటి కష్టాలను దూరం చేయడానికి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పర్యావరణ అనుమతులు రావడానికి కృషి చేసిన మంత్రి హరీశ్ రావును, నీటి పారుదల, అటవీశాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. పర్యావరణ అనుమతులు సాధించిన విషయాన్ని కింది స్థాయి అధికారులకు కూడా తెలిపి పనుల్లో ఎక్కడా ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు.

అభ్యంతరం లేదని తేల్చిచెప్పిన కమిటీ 


ఈ నెల 5న ఢిల్లీలో సమావేశమైన జల సంబంధమైన ప్రాజెక్టుల ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ (ఇఎసి) తెలంగాణలో చేపడుతున్న బృహత్తర నీటి పారుదల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదని తేల్చింది. ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు, కాలువలు, పంపుహౌజ్ ల నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ సమావేశం తేల్చిచెప్పింది.

ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ను సోమవారం విడుదల చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం 3100 హెక్టార్ల అటవీభూమిని స్వాధీనం చేసుకుని, దానికి ప్రత్యామ్నాయం మరో చోట ప్రభుత్వం భూమిని కేటాయించింది. అడవిని పెంచడానికి అవసరమైన డబ్బులను కూడా జమచేసింది. దీంతో అటవీశాఖ మొదటి, రెండో దశ అనుమతులు ఇచ్చింది. వీటి తర్వాత అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా సాధించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికున్న సాంకేతిక అడ్డంకులు తొలిగాయి.

నిర్మాణంలో వేగం పెంచాలి!

కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రగతి భవన్ లో నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఇ ఎన్ సి మురళీధర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టు సిఇ వెంకటేశ్వర్లు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఇ ఎ.నరేందర్ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎల్ అండ్ టి, మెగా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ‘‘ఎక్కువ నీటి లభ్యత ఉన్న చోట నుంచి నదీ జలాలను ఎత్తిపోసి, తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటాను సంపూర్ణంగా వాడుకునేందుకు ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేశాం. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. ఏడు పాత జిల్లాల పరిధిలో గల రాష్ట్రంలోని దాదాపు 70 శాతానికి పైగా వ్యవసాయ భూభాగానికి, మంచినీటికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుంది.

ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నాం. అటు అధికారులు, ఇటు వర్క్ ఏజన్సీలు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహజంగా ఉండే సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా  ప్రయత్నాలు చేస్తున్నాం. అటవీశాఖ అనుమతులు, పర్యావరణ అనుమతులు రావడానికి అటవీశాఖ అధికారులు శ్రమించారు. అందరికీ ధన్యవాదాలు. పర్యావరణ అనుమతులు వచ్చిన స్పూర్తితో ప్రాజెక్టు నిర్మాణంలో మరింత వేగం పెంచాలని నేను కోరుతున్నాను. ఓ భారీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 20 ఏండ్లకు పైగా సమయం తీసుకునే సంప్రదాయం ఉంది.

కానీ తెలంగాణ రైతులు నీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంత సమయం తీసుకోవద్దు. కేవలం రెండు మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి, తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా నీరు అందించాలని సంకల్పించాం. దానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది వర్షాకాలం నుంచే పాక్షికంగా నీటిని ఎత్తిపోసి వీలైనంత వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపుతాం. వచ్చే ఏడాది చివరి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజులు, కాల్వలు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.

ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, రైతులు, ఇంజనీర్లు పనిచేయాలని కోరుతున్నాను. ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావడానికి అవసరమైన నిధులు సిద్ధంగా పెట్టాం. బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయించడంతో పాటు వివిధ బ్యాంకుల ద్వారా మరో 20వేల కోట్లు సమీకరిస్తున్నాం. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త భూసేకరణ చట్టం ద్వారా రైతులకు ఎక్కువ మేలు కలుగుతున్నది కాబట్టి భూ సేకరణ కూడా వేగంగా జరుగుతున్నది.

అతి ముఖ్యమైన అనుమతులు కూడా వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, భూమి, అనుమతులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి, నిర్మాణంలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. మూడు షిఫ్టుల్లో 365 రోజులు పనిచేయాలి. జూన్ మాసం నుంచి వర్షాలు, గోదావరికి వరదలు వస్తాయి కాబట్టి జూన్ లోగా ఏ పనులు చేయాలి, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏ పనులు చేయాలి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ పనులు చేయాలనే విషయంలో స్పష్టతకు రావాలి. ఇప్పుడే రోజు వారీ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేయాలి. నేను నెలకోసారి, మంత్రి హరీశ్ పది రోజులకోసారి ప్రాజెక్టును సందర్శిస్తాం. అధికారులు నిత్యం పర్యవేక్షించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News