Silpa Chakrapani Reddy: ఇక ఏపీలో ఎన్నికల సందడి... కర్నూలులో మొదలైన నామినేషన్ల స్వీకరణ
- శిల్పా చక్రపాణి రాజీనామాతో ఖాళీ
- 26 వరకూ నామినేషన్ల స్వీకరణ
- టీడీపీ టికెట్ కోసం భారీ పోటీ
- చంద్రబాబు నిర్ణయమే ఫైనల్!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి, తన పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరిన నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుండగా, 26 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా, అధికార తెలుగుదేశం నుంచి ఈ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ అధికంగా ఉంది. చాలా మంది ఆశావహులు టికెట్ తమకే లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
ఇక అభ్యర్థి ఎంపిక టీడీపీకి కత్తి మీద సవాలేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. రెండు రోజుల క్రితం ఆ పార్టీ జిల్లా నేతలతో అధిష్ఠానం ఓ సమావేశాన్ని నిర్వహించింది. సీఎం చంద్రబాబు నిర్ణయమే ఈ విషయంలో ఫైనల్ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో కుటుంబంతో సహా ఉన్న చంద్రబాబునాయుడు, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత కర్నూలు ఎమ్మెల్సీ టికెట్ పై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.