Smriti Irani: గుజరాత్ సీఎం రేసులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ?
- సీఎం అభ్యర్థిగా స్మృతి ఇరానీ పేరును పరిశీలిస్తున్న అధిష్ఠానం
- నాయకత్వ లక్షణాలు, గుజరాతీ అనర్గళంగా మాట్లాడడం ప్లస్
- హిమాచల్‌ప్రదేశ్ సీఎం రేసులో జేపీ నడ్డా
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఇక మిగిలింది ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎన్నుకోవడమే. హిమాచల్‌ప్రదేశ్‌ను పక్కన పెడితే, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ప్రస్తుతం విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ రెండోసారి ఆయనను కొనసాగించేందుకు అధిష్ఠానం అంతగా ఇష్టపడడం లేదని సమాచారం. ఆయన స్థానంలో ప్రజాకర్షక నేతను సీఎంను చేయాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గుజరాతీలో బాగా మాట్లాడగలిగే నేర్పుతోపాటు, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగిన ఆమెను సీఎం పీఠంపై కూర్చోబెడితే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుకు ఎదురుండదని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
మరోవైపు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన పటీదార్ అయిన మన్సుఖ్ ఎల్ మాండవ్య పేరును కూడా పరిశీలిస్తున్నారు. రైతు పక్షపాతిగా పేరున్న ఆయన పేరు ముఖ్యమంత్రి రేసులో రెండో స్థానంలో ఉండగా, సీనియర్ నేత, పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన వాజుభాయ్ వాలా మూడో స్థానంలో ఉన్నారు. ఇక హిమాచల్‌ప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ఇప్పటికే కేంద్రమంత్రి జేపీ నడ్డా పేరు ప్రచారంలో ఉంది. అలాగే ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న జైరాం ఠాకూర్, సురేశ్ భరద్వాజ్, అజయ్ జంవాల్, రాజీవ్ బిందాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.