facebook: లైకులు, షేర్లు అడిగే పోస్టులపై చర్యలు తీసుకోనున్న ఫేస్బుక్
- తప్పుదోవ పట్టించే పోస్టులను కట్టడి చేసేందుకే నిర్ణయం
- సమాజానికి ఉపయోగపడే పోస్టులకు మినహాయింపు
- రెండు వారాల్లో అమల్లోకి
'నాని మీ ఫేవరెట్ హీరో అయితే లైక్ చేయండి', 'రూ. 100 రీఛార్జీ గెల్చుకోవడానికి పది మందికి ఈ పోస్టును షేర్ చేయండి' అంటూ వచ్చే పోస్టులను నియంత్రించేందుకు ఫేస్బుక్ యత్నిస్తోంది. యూజర్ల దగ్గర లైకులు, షేర్లు, కామెంట్లు, ట్యాగులు అడుక్కుని ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నించే ఫేస్బుక్ పేజీలపై కొరడా ఝుళిపించనుంది.
ఇలాంటి పోస్టులను గుర్తించడానికి ఓ మెషీన్ లాంగ్వేజ్‌ను ఫేస్బుక్ రూపొందించింది. తప్పుదోవ పట్టించే పోస్టులు చేసే పేజీలను తాత్కాలికంగా నిలిపేవేసేలా ఈ లాంగ్వేజ్‌ను తయారుచేశారు. అయితే రక్తదానం, తప్పిపోయిన పిల్లల సమాచారం వంటి సమాజానికి ఉపయోగపడే పోస్టులకు మినహాయింపు కల్పించింది. రెండు వారాల్లో ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.