High Court: తెలుగు భాషలో వాదనలు.. హైకోర్టులో అరుదైన ఘటన!
- అనుమతించిన న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి
- వాదించిన న్యాయవాది సోమరాజు
- భూ సేకరణ వివాదం కేసుకు సంబంధించి విచారణ
తెలుగు భాషకు పట్టం కడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సహజంగా ఇంగ్లిషులోనే వాదనలు జరిగే హైకోర్టులో ఈ రోజు తెలుగులో వాదనలు వినిపించాయి. అందుకు న్యాయవాది సోమరాజు చేసిన విజ్ఞప్తిని గౌరవ న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి అంగీకరించారు.
భూ సేకరణ వివాదం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ న్యాయవాది సోమరాజు తెలుగులో వాదనలు వినిపించి ఆకట్టుకున్నారు. వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి తీర్పు వెలువరించి సమస్యను పరిష్కరించారు. తెలుగులో వాదనలు వినిపించిన న్యాయవాది సోమరాజును పలువురు న్యాయవాదులు అభినందించారు.