Bill Gates: బిల్గేట్స్లో స్ఫూర్తి రగిలించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’!
- ఈ ఏడాది తనకు స్ఫూర్తినిచ్చిన ఘటనలను ట్వీట్ చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
- అక్షయ్ కుమార్ సినిమా ప్రేక్షకుల్లో చైతన్యం నింపిందన్న గేట్స్
- మాల్దీవులు, భూటాన్‌లు తట్టును తరిమికొట్టడం స్ఫూర్తిదాయకమని ప్రశంస
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’ సినిమా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు తెగ నచ్చేసిందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెబుతూ ఈ సినిమా తనలో స్ఫూర్తి రగిలించిందన్నారు. ఈ సినిమాలో కొత్తగా పెళ్లయిన జంట చేసిన రొమాన్స్ ప్రేక్షకులను చైతన్యం చేసిందన్నారు. భారత్‌లో సవాలు విసురుతున్న పారిశుద్ధ్యం గురించి ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’ చక్కగా వివరించిందన్నారు.
దీంతోపాటు బిల్‌గేట్స్ మరో ట్వీట్ కూడా చేశారు. మాల్దీవులు, భూటాన్‌లు తట్టును పూర్తిగా పారదోలినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొందని, ఇది ఎంతో ప్రేరణ కలిగిస్తోందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది కొంచెం కఠినంగా గడిచిందని పేర్కొన్న బిల్‌గేట్స్, 2017లో తనకు ప్రేరణ ఇచ్చిన ట్వీట్లు ఇవే అంటూ కొన్ని ట్వీట్లను రీ ట్వీట్ చేశారు.