donja: డోంజా గ్రామంలో పర్యటించిన మాస్టర్ బ్లాస్టర్
- సచిన్ దత్తత తీసుకున్న రెండో గ్రామమిది
- అభివృద్ధి పరిశీలన కోసం పర్యటన
- ఫొటోల కోసం పోటీ పడిన గ్రామస్థులు
సన్సాద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద ఎంపీ హోదాలో తాను దత్తత తీసుకున్న డోంజా గ్రామంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పర్యటించారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న ఈ గ్రామ అభివృద్ధి కోసం రూ. 4 కోట్ల నిధులను సచిన్ గతంలో విడుదల చేశారు. ప్రస్తుతం గ్రామ అభివృద్ధిని పరిశీలించడానికి ఆయన అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
సచిన్ తమ గ్రామానికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరూ కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు వారంతా పోటీపడ్డారు. ఎంపీ నిధులను అక్కడి పాఠశాల భవనం, కాంక్రీట్ రోడ్లు, మంచినీరు, పారిశుద్ధ్య పనులకు వినియోగించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ గమే, సచిన్‌కి తెలియజేశారు.
డోంజా గ్రామ పర్యటనకు సంబంధించిన ఫొటోలను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘డోంజా గ్రామ పర్యటన నాకెంతో సంతృప్తినిచ్చింది. అక్కడ జరుగుతున్న పనులు చూస్తే నేను ప్రజలకిచ్చిన మాట నెరవేరబోతుందన్న నమ్మకం కలిగింది. గ్రామస్థులకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు మనం చాలా దూరంలో ఉన్నాం. ఇలాంటి పథకాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అని సచిన్ పేర్కొన్నారు. ఈ గ్రామానికంటే ముందు సచిన్ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టంరాజు కండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.