online: ఆన్లైన్ ద్వారా సైకత శిల్ప కళలో శిక్షణనివ్వనున్న సుదర్శన్ పట్నాయక్
- అనుమతించిన మానవ వనరుల శాఖ
- ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం
- మార్చిలో ప్రారంభం
ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ (సైకత శిల్పి) సుదర్శన్ పట్నాయక్ తన కళను నలుగురికీ నేర్పించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. దీని గురించి ఒక ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు గతేడాది ఆయన ప్రకటించారు. సర్టిఫికెట్ కోర్సు కోసం అనుమతి కోరుతూ మానవవనరుల మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లకు ఆయన కళను నిజం చేస్తూ మానవవనరుల శాఖ సుదర్శన్ పట్నాయక్‌కి అనుమతినిచ్చింది.
ఈ కోర్సును ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆయన ప్రారంభించనున్నారు. మార్చి 2018లో ప్రారంభంకానున్న ఈ కోర్సు ప్రపంచంలోనే మొదటి ఆన్లైన్ శాండ్ ఆర్ట్ సర్టిఫికెట్ కోర్సుగా నిలవనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ వీడియోల రికార్డింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
ఇప్పటికే పూరీ బీచ్‌లో గోల్డెన్ శాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ శిక్షణ కార్యక్రమాన్ని సుదర్శన్ నిర్వహిస్తున్నారు. అయితే ఆన్లైన్ కోర్సులో అందించే సూచనల ద్వారా ప్రతి ఒక్కరూ శాండ్ ఆర్ట్ మెళకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆయన వెల్లడించారు.