kangana ranaut: అవార్డు వేడుకలకు హాజరుకాకపోవడంపై స్పష్టతనిచ్చిన కంగనా రనౌత్
- నటన కంటే హాజరుకే ప్రాధాన్యతనిస్తానని వ్యాఖ్య
- తనకు అవార్డుల విషయంలో ఎదురైన అనుభవాల గురించి ప్రస్తావన
- సినీవిమర్శకుల రేడియో ఇంటర్వ్యూలో వెల్లడించిన నటి
బాలీవుడ్‌లో ఎన్నో అవార్డు వేడుకలు జరుగుతుంటాయి. కానీ నటి కంగనా రనౌత్ ఒక్క వేడుకలోనూ కనిపించదు. 2014 నుంచి ఆమె అవార్డు వేడుకలకు హాజరుకావడం మానేసిన విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకు మానేసిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ విషయాలను ఇటీవల సినీవిమర్శకులు రాజీవ్ మసంద్, అనుపమ చోప్రాలకు ఇచ్చిన 'రేడియో' ఇంటర్వ్యూలో కంగనా వెల్లడించింది.
అవార్డులు కేవలం వికీపీడియా పేజీలో జోడించడానికే పనికొస్తాయని, అవి ఇచ్చే వారికి నటనా ప్రదర్శన కన్నా వేడుకకు హాజరవడమే ముఖ్యమని ఆమె ఆరోపించింది. ఆమె మాటలకు మద్దతుగా కొన్ని సంఘటనలను ఉదహరించింది. 'ఒకసారి నేను ఓ అవార్డు వేడుకకు ట్రాఫిక్ కారణంగా పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో నాకు ఇవ్వాల్సిన ఆ అవార్డును సోహా అలీఖాన్‌కి ఇచ్చేశారు' అని కంగనా చెప్పింది.
అలాగే ఫిలింఫేర్ వాళ్లు కూడా 'క్రిష్ 3' సినిమా సమయంలో అవార్డు ఇస్తామన్నారని, తాను హాజరుకాలేకపోవడంతో అవార్డును వేరే వాళ్లకు ఇచ్చినట్లు కంగనా పేర్కొంది. అలాగే అవార్డుల వేడుకలలో డ్యాన్సులు చేస్తే పారితోషికంతో పాటు, అవార్డు కూడా ఇస్తామని ఆశజూపిన వాళ్లు కూడా ఉన్నారని కంగనా వివరించింది. తాను అవార్డు కార్యక్రమాలకు వెళ్లడం మానేసిన తర్వాత అవార్డుల్లో తన పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని, తర్వాత తనకు జాతీయ అవార్డులు వచ్చినపుడు వారు నోరెళ్లబెట్టుకున్నారని కంగనా తెలిపింది.
అయితే కంగనాను ఎలాంటి అవార్డు కోసం తాను సంప్రదించలేదని ఫిలింఫేర్ ఎడిటర్ జితేశ్ పిళ్లై ట్వీట్ చేశారు.